ప్రియాతి ప్రియమైన మౌర్యా!
ఎలా వున్నావు?ఇదొక పిచ్చి ప్రశ్న. నువ్వు ఎలావుంటావో నాకు తెలుసు. భుజము మీద తుపాకీతో వెనక ఒక బ్యాగ్ తో మంచుకొండల్లో నడుస్తూ ఈదురుగాలిలో ఉక్కు స్థంభము కదులుతున్నట్లు ఏ భావము లేకుండా అలా.. ఉంటావు.ఎలా ఉంటావు? అంటే నువ్వు నాకు చెప్పే జవాబు నాకు తెలుసు దేశము కోసము.
నువ్వు అక్కడ మంచు కరగేసి నీళ్లు త్రాగుతుంటే నేనిక్కడ ఫ్రిజ్ లో చన్నీళ్లు తాగుదామనుకుంటే గొంతు దిగవే!... ప్రతి నిమిషము నీ ధ్యాసే నాకు. నువ్వు నా గురించి కొంచెమైనా ఆలోచిస్తావా? నువ్వు ఎక్కడున్నావు?ఏం తింటున్నావు?ఇవన్నీ కూడా పిచ్చి ప్రశ్నలే .
ఎక్కడుంటావు? కంచెకు కొంచెం దగ్గరో, దూరంగానో.. నీ కంటే నీ తుపాకీకి ఆకలెక్కువ.నాకు ఊహించాలంటేనే భయము వేస్తుంది.
నిన్ను పెళ్లిచేసుకుంటానంటే ఇంట్లో అందరూ గొడవ. ఆర్మీ లో చేసేవాడితో పెళ్లి వద్దే అంటే విన్నానా!ఉహు!నీ కోర మీసము, నీ చూపుల్లో సాహసము నీ నవ్వులో స్నేహము ఒకటేమిటి? అన్నీ చూసి చేసుకున్నాను. ఒక మత్తులో, మైకము లో అలా చేసుకున్నానా.. ఇప్పుడు చూడు!నీ ఉత్తరము కోసము పడిగాపులు. నీ గురించి బెంగ.. నువ్వేమో దేశానికి గోడ లాగా నిలబడి ఉంటావు. నిజమే. నీకీ పేరు సరిపోతుంది. ఎందుకంటే నేను ఏమి చెప్పినా అది గోడతో చెప్పుకున్నట్లే..
నేను ఇంత పెద్ద ఉత్తరము వ్రాస్తే నీ ఉత్తరము ఎప్పుడో నెలరోజులకు వస్తుంది. పోనీ నువ్వు నన్ను తీసికెళ్ళరాదు. ఆ మంచు కొండల్లో హాయిగా వుంటాను నువ్వు ఎక్కడ వుంటే అదే స్వర్గము. ఇక్కడ నేను స్కూల్ కి వెళ్లి పాఠాలు చెప్పి ఈసురో మని వస్తాను.
మళ్ళీ నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు నన్ను నిద్రపోనివ్వవు.
అత్తయ్య, మామయ్య బాగానే వున్నారు. ఎవరైనా పలకరిస్తే మామయ్య" మా వాడు ఆర్మీ "అని చెప్తారు చూడు అప్పుడు అయన కళ్ళల్లో గర్వం తొణికిసలాడుతుంది. నిన్ను తల్చుకుంటే నాకు దిగులు. ఎప్పుడు వస్తావు? నీకు తెలుస్తుందా కొంచెమైనా. నువ్వూ నీ తుపాకీ లాగా ఏ భావము లేకుండా ఉంటావు. ఏమి చెప్పాలి?
ఎప్పుడు డొస్తావు? ఎప్పుడొస్తావు? ఈ సారి వచ్చాక వదిలిపోకురా!
ఈ లోపల ఏ యుద్ధము రాకూడదు దేవుడా!
నన్ను ఒక్క క్షణమైనా
వదిలిపెట్టవుకదా!నీకు దేశభక్తి తప్ప నా మీద ప్రేమ లేదు.నీకు ఆడవాళ్ళ మనసు గురించి ఎప్పుడు తెలుస్తుంది? సైనిక కవాతుల మధ్య, తుపాకీల హోరులో సున్నితమైన భావాలకు తావెక్కడ? ఏం ఆలోచిస్తున్నావు నాగురించి? నీ ఉత్త రాల్లో ఎప్పుడూ ధైర్యముగురించే నూరి పోస్తావు. ఇవన్నీ ఏమి తెలియదు నాకు. నీ గురించి తప్ప నేనింకేమీ ఆలోచించను.ఎప్పుడు వస్తావు? నాకు దిగులుగా వుంది.
తప్పకుండా వస్తావు కదూ..ఈసారి నీ ఉత్తరము కాదు నువ్వే రావాలి. వస్తావు కదూ...
నీకై నీకై క్షణ క్షణం ఎదురు చూచే
నీ
ధైర్య.
Loading comments…